పత్రము

మొక్క యొక్క అవయవము

పత్రాలు లేదా ఆకులు వృక్ష కాండం మీద బహిర్గతంగా కణుపుల దగ్గర అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు. ఇవి సాధారణంగా బల్లపరుపుగా, ఆకుపచ్చగా ఉండి పరిమిత వృద్ధి కలిగి కాండాగ్రం వరకు అగ్రాభిసారంగా ఏర్పడతాయి. ఆకులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి. కొన్ని రకాల ఆకుల్ని మనం ఆకు కూరలుగా తింటాము.

ఈనెల వ్యాపనం స్పష్టంగా ఉన్న రావి ఆకు.

పత్రం భాగాలు

మార్చు

పత్రంలో నాలుగు భాగాలుంటాయి.

పత్రపీఠం (Leaf base)

మార్చు

కణుపు వద్ద కాండానికి అతుక్కొని ఉండే పత్రవృంత పూర్వాంత భాగమే పత్రపీఠం. లెగుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలలో ఇది ఉబ్బి తల్పం వలె ఉంటుంది. గడ్డి జాతులలో ఇది కాండానికి ఒరవలె చుట్టుకొని ఉంటుంది. ఇట్లాంటి పత్రపీఠాన్ని '' అచ్చాదన పత్రపీఠం '' అంటారు.

పత్రపుచ్ఛం (Stipule)

మార్చు

పత్రపీఠానికిరువైపులా పెరిగే ఆకుపచ్చని సన్నటి పోచల వంటి నిర్మాణాలు. ఇవి తొలిదశలో గ్రీవపు మొగ్గలకు రక్షణ కలిగిస్తాయి. పత్రదళం విసరించుకునే సమయానికి పత్రపుచ్ఛాలు సాధారణంగా రాలిపోతాయి. వీటిని 'రాలిపోయే పత్రపుచ్ఛాలు' (Deciduous stipules) అంటారు. ఉ. మైకేలియ. ఎక్కువకాలం ఉండే పత్రపుచ్ఛాలను 'దీర్ఘకాలిక పత్రపుచ్ఛాలు' (Persistent stipules) అంటారు. ఉ. రోసా, పైసమ్

పత్రపుచ్చాలు - రకాలు

మార్చు
క్రమసంఖ్య పత్రపుచ్చాలు ఉదాహరణలు
1 పార్శ్వ పత్ర పుచ్చాలు హైబిస్కస్, స్పేషియా
2 అశ్లేషిత పత్ర పుచ్చాలు గులాబి, వేరుశనగ
3 వృత్తాంతర పత్ర పుచ్చాలు ఇక్సోరా, హెమీలియా
4 గ్రివా పత్ర పుచ్చాలు బర్న మొంటాన, గార్డేనియా
5 అక్రేషియస్ పత్ర పుచ్చాలు రూమెక్స్, పాలిగోనమ్
6 పత్రాకార పత్ర పుచ్చాలు

పత్రవృంతం (Petiole)

మార్చు

పత్రదళాన్ని కాండానికి కలిపిఉంచే సన్నని కాడవంటి భాగం. ఇది పత్రాలను కాండం నుంచి నిర్ణీతమైన దూరంలో అమర్చి, వాటికి సూర్యరశ్మి, గాలి సరిగా సోకేటట్లు చేస్తుంది. పత్రం బరువును భరించి, పోషకపదార్ధాలను ఇరువైపులా సరఫరా చేయటంలో తోడ్పడుతుంది.

పత్రదళం (Lamina)

మార్చు

పత్రవృంతం కొన భాగంలో ఆకుపచ్చగా బల్లపరుపుగా విస్తరించి ఉన్న భాగం. పత్రంలో జరిగే ముఖ్యమైన విధులన్నీ దీనిలోనే జరుగుతాయి. పత్రదళంలో అనేక రకాలు ఉన్నాయి. అలాగే వాటి ఆకారాలు, అంచులు, అగ్రాలు వేరువేరుగా ఉంటాయి.

పత్రదళం-రకాలు
  1. ఎటవాలు పత్రదళం -ఉదా: వేప
  2. శాణాకార పత్రదళం - ఉదా: ఫిస్టియా
  3. చెంచాకారా పత్రదళం - ఉదా: డ్రాసిరా
  4. బాణాకారా పత్రదళం - ఉదా: చామ (కొలకేషియా)
  5. బాకు ఆకార పత్రదళం - ఉదా:
పత్రదళం-ఆకారాలు

పత్రదళం వివిధ ఆకారాలలో కనిపిస్తుంది.

  1. సూది ఆకార పత్రదళం -ఉదా: ఎడారి మొక్కలు
  2. రేఖాకార పత్రదళం -ఉదా: గడ్డిజాతి మొక్కలు
  3. బల్లాకార పత్రదళం -ఉదా: గన్నెరు
  4. అండాకార పత్రదళం -ఉదా: మందార
  5. విపరీత అండాకార పత్రదళం -ఉదా: బాదం
  6. హృదయాకార పత్రదళం -ఉదా: మర్రి, రాగి
  7. విపరీతాకార పత్రదళం -ఉదా: దేవకాంచనం
  8. దీర్ఘ చతురస్రాకార పత్రదళం -ఉదా: అరటి
  9. దీర్ఘ వృత్తాకార పత్రదళం -ఉదా: సీతాఫలం
  10. మూత్రపిండాకార పత్రదళం -ఉదా: సరస్వతి ఆకు
  11. వర్తులాకార పత్రదళం -ఉదా: తామర
  12. వీణాకార పత్రదళం -ఉదా: ఆవాలు
పత్రపుటంచు-రకాలు
  1. రుజు ఉపాంతం - ఉదా: సీతాఫలం
  2. తరలిత ఉపాంతం - ఉదా: అశోక (నరమామిడి)
  3. రంపపుటంచు ఉపాంతం - ఉదా: మందార
  4. దంతాకార ఉపాంతం - ఉదా: తుత్తుర బెండ
  5. వలయ దంతాకార ఉపాంతం - ఉదా: రణపాల
  6. కంటక ఉపాంతం - ఉదా: బల రక్కసి (అర్గిమోనాస్ యాక్సికొనా)
పత్రాగ్రం - రకాలు
  1. వారాగ్రం - ఉదా: రావి
  2. నిశ్చితాగ్రం - ఉదా: మందార
  3. గురు అగ్రం - ఉదా: బాదం
  4. ఉపాంతరహితాగ్రం - ఉదా: దేవకాంచనం
  5. రెట్యూజ్ అగ్రం - ఉదా: ఫిస్టియా
  6. కస్పిడేట్ అగ్రం - ఉదా: కలబంద
  7. సిర్రోజ్ అగ్రం - ఉదా: అరటి
  8. నాభి అగ్రం - ఉదా:

పత్రాలు రకాలు

మార్చు

సరళ పత్రాలు

మార్చు

సరళపత్రాలు (Simple leaves) లో పత్రవృంతం చివరలో ఒకే పత్రదళం ఉంటుంది. ఈ పత్రదళం అవిభక్తంగాగాని (ఉదా: అనొనా, సిడియం) లేదా విభక్తంగాగాని ఉంటుంది. పత్రదళం విభక్తమై ఉన్నప్పుడు తమ్మెలు పిచ్ఛాకారంగాగాని (ఉదా: బ్రాసికా), లేదా హస్తాకారంగాగాని (ఉదా: గాసిపియమ్, పాసిఫ్లోరా) ఉండవచ్చును.

సంయుక్త పత్రాలు

మార్చు

పత్రదళం పూర్తిగా నడిమి ఈనె వరకు, లేదా పత్రవృంతం అగ్రం వరకూ విభక్తమై అనేక పత్రకాలను (Leaflets) ఏర్పరుస్తుంది. సంయుక్తపత్రాలకు గ్రీవపు మొగ్గలుంటాయి. కానీ పత్రకాలకు ఉండవు. సంయుక్త పత్రాల వృంతాన్ని విన్యాసాక్షం (Rachis) అంటారు. సంయుక్తపత్రాలు రెండు రకాలుగా ఉంటాయి.

  • పిచ్ఛాకార సంయుక్త పత్రాలు (Pinnately compound leaves) :-

దీనిలో పత్రకాలు విన్యాసాక్షానికి ఇరువైపులా అమరి ఉంటాయి.

    • ఏకపక్షవత్ సంయుక్త పత్రం: దీనిలో విన్యాసాక్షం ఒకటే ఉంటుంది. దీనికి శాఖలు ఉండవు. పత్రకాలు విన్యాసాక్షంపై జతలుగా గానీ లేదా ఏకాంతరంగానీ ఉంటాయి. పత్రకాల సంఖ్యను బట్టి ఇవి రెండు రకాలు.
      • సమపిచ్ఛకం (Paripinnate) : విన్యాసాక్షంపైన పత్రకాలు సరిసంఖ్యలో ఉంటాయి. ఉదా: చింత.
      • విషమపిఛకం (Imparipinnate) విన్యాసాక్షం ఒకే పత్రకంతో అంతమవటంచేత పత్రకాలు బేసిసంఖ్యలో ఉంటాయి. ఉదా: వేప.
    • ద్విపక్షవత్ సంయుక్త పత్రం: ఈ సంయుక్తపత్రంలో ప్రథమ విన్యాసాక్షం శాఖాయుతంగా ఉంటుంది. ఈ శాఖలను ద్వితీయ విన్యాసాక్షాలు అంటారు. వీటిపైన పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: అకేసియా అరాబికా (తుమ్మ)
    • త్రిపక్షవత్ సంయుక్త పత్రం: దీనిలో ప్రథమ విన్యాసాక్షంనుంచి, ద్వితీయ శాఖలు ఏర్పడతాయి. వీటి నుంచి తృతీయ విన్యాసాక్షాలు వృద్ధిచెంది వీటిమీద పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: మునగ, పున్నాగ.
    • బహుళ సంయుక్త పత్రం: ప్రథమ విన్యాసాక్షం అనేక శ్రేణుల్లో విభజన చెంది ఉంటుంది. చివరి శ్రేణి శాఖలపై పత్రకాలు అమరి ఉంటాయి. ఉదా: కొత్తిమీర
  • హస్తాకార సంయుక్త పత్రాలు (Palmately compound leaves) :-

దీనిలో పత్రకాలన్నీ పత్రవృంతం కొన వద్ద సంలగ్నంగా ఉంటాయి. ఈ పత్రంలో విన్యాసాక్షం ఉండదు. ఇవి పత్రకాల సంఖ్యను బట్టి ఆరు రకాలు.

    • ఏకదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో ఒకే పత్రకం ఉంటుంది. ఉదా: సిట్రస్ జాతులు.
    • ద్విదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో రెండు పత్రకాలు ఉంటాయి. ఉదా: హార్డ్ వికియ
    • త్రిదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో మూడు పత్రకాలు ఉంటాయి. ఉదా: చిక్కుడు.
    • చతుర్దళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో నాలుగు పత్రకాలు ఉంటాయి. ఉదా: మార్సీలియా.
    • పంచదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో ఐదు పత్రకాలు ఉంటాయి. ఉదా: గైనాన్డ్రాప్సిస్.
    • బహుదళయుత సంయుక్త పత్రం: పత్రవృంతం కొనలో ఐదు కంటే ఎక్కువ పత్రకాలు ఉంటాయి. ఉదా: బూరుగ.

లఘు, మిశ్రమ, విభిన్న పత్రాలు

మార్చు

జామ, తొగరు, రావిఆకు లందువలె కొన్ని ఆకుల కొక పత్రమే ఉంది. అట్లున్నయెడల లఘుపత్ర మందుము. చిక్కుడాకులోవలె కొన్ని కలిసియున్న యెడల నది మిశ్రమ పత్రము. ఒకటి మిశ్రమపత్రమో, కొమ్మయో నిర్ధారణ చేయుటకు అది ఏ ఆకు కణుపు సందులో నైన పెరుగుచున్నదో, దాని మీదనున్న ఆకుల కణుపు సందులలో మొగ్గలేమైనా గలవూ చూడవలెను. తుమ్మాకును తురాయి ఆకును మిశ్రమ పత్రములేకాని తురాయి తుమ్మ ఆకులలో పెద్దాకు రెండుసారులు విభజితమైయున్నది. కావున వీనిని ద్విభిన్న పత్రమందుము. ఇట్లే మూడుసారులు విభజితమై యున్నయెడల త్రిభిన్న మనియు, ఇంక నెక్కువసారులు విభజించియున్న యెడల బహుభిన్నపత్రమనియు నందుము. మిశ్రమ పత్రములందున్న చిన్నచిన్న ఆకులను చిట్టి ఆకులందుము. వేపాకులో చిట్టి ఆకులు జతలు జతలుగా ఉండి చివరన ఒకటి కలదు, ఆకుల సంఖ్య బేసి. తురాయి ఆకులో అన్నియు జతలు జతలు గానేయున్నవి, ఆకుల సంఖ్య సరి. కావున తురాయి ఆకును సమభిన్నపత్రమనియు, వేపాకును విషమభిన్నపత్రమనియు చెప్పుదుము. వేపాకు, చింతాకు, తురాయి ఆకులలో చిట్టి ఆకులు మధ్యనున్న కాడకు రెండు ప్రక్కల పక్షి రెక్కల మీదనున్న ఈకలవలె ఉండుటచే ఆ ఆకును పక్షివైఖరిగ ఉన్నదందుము. బూరుగాకు కుక్కవాయింటాకును మిశ్రమపత్రములే కాని ఇట్లు లేవు. మన చేతి వేళ్లు తెరచినప్పుడు ఎట్లుండునో అట్లు చిట్టి ఆకులన్నియు ఉన్నవి, లేదా ఇంచుమించు తాటి ఆకులలో చీలికలున్నట్లు ఉన్నాయి. కావున నిది తాళపత్ర వైఖరి నున్నదందుము.

పత్ర విన్యాసం

మార్చు

కాండంపైన, శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని 'పత్రవిన్యాసం' (Phylotaxy) అంటారు. మొక్కలోని పత్రాలన్నీ సూర్యరశ్మిని పొందటానికి అనుగుణంగా కాండంపై ఒక క్రమపద్ధతిలో, గణితబద్ధంగా, జన్యునిర్దేశితమై ఉంటాయి. కణుపులవద్ద ఏర్పడే పత్రాల సంఖ్యను బట్టి పత్రవిన్యాసం మూడు రకాలుగా ఉంటుంది.

ఏకాంతర పత్రవిన్యాసం

మార్చు

ఈ పత్రవిన్యాసంలో ప్రతి కణుపు వద్ద ఒకే పత్రం ఏర్పడుతుంది. పత్రాలన్నీ కాండం చుట్టూ నిర్ధిష్ట దూరంలో నిర్ధిష్టమైన నిలువు వరుసలలో అమరి ఉంటాయి. ఉదా: మందార.

అభిముఖ పత్రవిన్యాసం

మార్చు

ప్రతీ కణుపు దగ్గర రెండేసి పత్రాలు అభిముఖంగా ఏర్పడతాయి. ఇవి రెండు రకాలు.

  • అభిముఖ ఉపరిస్థిత పత్రవిన్యాసం: ఒక కణుపు దగ్గర ఉండే పత్రాల జత, దానిపై కణుపు దగ్గర ఉండే పత్రాల జతకు సరిగ్గా పైన ఉంటాయి. ఉదా: క్విస్ క్వాలిస్.
  • అభిముఖ డెకుస్సేట్ పత్రవిన్యాసం: ఒక కణుపు దగ్గర ఉండే పత్రాల జత, దానిపై కణుపు దగ్గర ఉండే పత్రాల జతకు సమకోణంలో ఉంటాయి. ఉదా: జిల్లేడు.

వలయ లేదా చక్రీయ పత్రవిన్యాసం

మార్చు

ప్రతీ కణుపు దగ్గర రెండు కంటే ఎక్కువ పత్రాలు చక్రీయంగా ఏర్పడతాయి. ఉదా: గన్నేరు.

కాండం నుండి పత్రంలోకి ప్రవేశించిన నాళికాపుంజాలు పత్రదళంలో శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి. వీటినే ఈనెలు అంటారు. ఇవి ఆకులపై గీతలు మాదిరిగా కనిపిస్తాయి. ఆకుల మీద సాధారణంగా మధ్యనొక పెద్ద ఈనె ఉండి దాని నుండి చిన్న ఈనెలు వచ్చి ఒక దానితోనొకటి శాఖోపశాఖలై గలియుచున్నవి. ఇట్లు ఒకదానితో నొకటి కలియుచుండిన విషమరేఖ పత్రమందుము. మెట్టతామర, కొబ్బరి మొదలగు ఆకులలో ఈనెలు కొనవరకును కలియకుండనే పోవుచున్నవి. అవి సమరేఖ పత్రములు. ప్రత్తి, గంగరావి ఆకులలో ఈనెలు తాళపత్ర వైఖరిగనున్నవి. అరటి ఆకువలె కొన్ని నున్నగానుండును. మర్రి ఆకులవలె కొన్ని దట్టముగా ఉండును. కొన్ని ఆకుల మీద మెత్తనివో బిరుసువో రోమములు కలుగుచున్నవి.

ఈనెల వ్యాపనం
పత్రదళంలో ఈనెలు అమరి ఉండు విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. ప్రధానంగా ఇది రెండు రకాలు. అవి. 1. జాలాకార ఈనెల వ్యాపనం, 2. సమాంతర ఈనెల వ్యాపనం.
  1. జాలాకార ఈనెల వ్యాపనం: దృఢమైన ప్రధానమైన ఈనె నుండి ఏర్పడే చిన్న ఈనెలు అన్నీ క్రమరహితంగా విస్తరించి వల వలె అమరి ఉండే ఈనెల వ్యాపనాన్ని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. ఇది రెండు రకాలు. అవి. అ). పిచ్చాకార జాలాకార ఈనెల వ్యాపనం, ఆ). హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనం
అ). పిచ్చాకార జాలాకార ఈనెల వ్యాపనం: నడిమి ఈనె ఒకటి మాత్రమే ప్రధానమైనదిగా ఉండి, దాని నుండి చిన్న ఈనెలు ఏర్పడుతాయి.
ఆ). హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనం: పత్రదళంలో ప్రధాన ఈనెలు ఒకటి కన్నా ఏక్కువగా ఉండి, వాటి నుండి చిన్న ఈనెలను ఏర్పడుతాయి. ఇది రెండు రకాలు. అవి...
క) అపసరిత హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనం: ఉదా: దోసలో ఈ రకమైన ఈనెల వ్యాపనం చూడవచ్చు.
ఖ) అభిసరిత హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనం: ఉదా: రేగులో ఈ రకమైన ఈనెల వ్యాపనం చూడవచ్చు.
  1. సమాంతర ఈనెల వ్యాపనం: ప్రధాన ఈనెకు సమాంతరంగా చిన్న ఈనెలు విస్తరించి ఉండు ఈనెల వ్యాపనం సమాంతర ఈనెల వ్యాపనం. ఇది రెండు రకాలు అవి...
అ). పిచ్చాకార సమాంతర ఈనెల వ్యాపనం: పత్రవృంతం చివర నుండి ఒకే ఈనె పత్రదళంలో ప్రవేశించి చివరికంటా విస్తరిస్తుంది.
ఆ). హస్తాకార సమాంతర ఈనెల వ్యాపనం: సమాన ధారుఢ్యం కలిగిన ఈనెలు ఎక్కువ సంఖ్యలో సమాంతరంగా విస్తరిస్తాయి. ఇది రెండు రకాలు అవి...
క) అపసరిత హస్తాకార సమాంతర ఈనెల వ్యాపనం: ఉదా: తాటిచెట్టు పత్రంలో ఈ రకమైన ఈనెల వ్యాపనం చూడవచ్చు.
ఖ) అభిసరిత హస్తాకార సమాంతర ఈనెల వ్యాపనం: ఉదా: గడ్డి జాతి మొక్కలు. జొన్నలో ఈ రకమైన ఈనెల వ్యాపనం చూడవచ్చు.

తమ్మె

మార్చు

ఆముదపాకులో ఆకులు సగముచీలి సగముచీలకయున్నవి. ఇవియు లఘుపత్రములే. తొడిమ వరకు కాని, మధ్య కాడ వరకు కాని (పక్ష వైఖరి ఆకులందు) చీలియుండినగాని మిశ్రమ పత్రములు కావు. ఆముదపు ఆకులో ఆ చీలికలకు తమ్మెలని పేరు.

ఆకు నాల్గవ వంతు మొదలు సగమువరకు తమ్మెల క్రింద చీలియున్నచో దానిని చ్ఛేదితము అందుము. సగము మొదలు ముప్పాతిక వరకు చీలియున్నచో విభాజిత మందుము. ముప్పాతికకు మించెనా ఖండితమందుము.

పత్ర రూపాంతరాలు

మార్చు

పరిసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన విధులను నిర్వహించడానికి పత్రం పూర్తిగాగాని, లేక కొంతభాగంగాని శాశ్వతమైన మార్పుచెందితే దానిని 'పత్రరూపాంతరం' అంటారు.

నులితీగలు

మార్చు

కొన్ని బలహీనమైన కాండాలు ఉన్న మొక్కలలో పూర్తి పత్రంగానీ, పత్రభాగాలుగానీ రూపాంతరం చెంది సన్నటి నులితీగలుగా ఏర్పడతాయి. ఇవి మొక్కలకు యాంత్రిక ఆధారాన్నిస్తూ, మొక్క ఎగబాకటంలో తోడ్పడతాయి.

  • పూర్తిపత్రం ఉదా: లాథిరస్
  • సంయుక్తపత్రంలో అగ్రపత్రకాలు ఉదా: పైసమ్
  • పత్రాగ్రం ఉదా: గ్లోరియోస
  • పత్రపుచ్ఛాలు ఉదా: స్మైలాక్స్
  • పత్రవృంతం ఉదా: క్లీమాటిస్
  • నడిమి ఈనె ఉదా: నెపెంథిస్

కంటకాలు

మార్చు

కొన్ని మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెంది వాడిగా, మొనతేలిన కంటకాలలాగా ఏర్పడతాయి. ఇవి ఎడారి మొక్కలలో బాష్పోత్సేక వేగాన్ని తగ్గించి నీటి ఎద్దడిని తట్టుకోవడానికి, పశువుల బారినుంచి మొక్కను రక్షించడానికి తోడ్పడతాయి.

పొలుసాకులు

మార్చు

కొన్ని ఎడారి మొక్కలలోను, భూగర్భ కాండాలలోను పత్రాలు క్షీణించి, ఎండిపోయిన పలుచని పొరవంటి వర్ణరహితమైన నిర్మాణాలుగా ఏర్పడతాయి. వీటిని పొలుసాకులు అంటారు. ఎడారి మొక్కలలో ఇవి బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. భూగర్భకాండాలలో ఇవి గ్రీవపు మొగ్గలను, కొన మొగ్గలను రక్షిస్తూ ఉంటాయి. ఉల్లిలో పొలుసాకులు ఆహారపదార్ధాలను నిలువచేస్తాయి.

ప్రభాసనం

మార్చు

పత్రవృంతం గానీ ద్వితీయ విన్యాసాక్షాలు గానీ బల్లపరుపు లేదా రెక్క వంటి ఆకుపచ్చని పత్రం వంటి నిర్మాణంగా మారి కిరణజన్యసంయోగక్రియను జరుపుతాయి. ఉదా: అకేషియా, పార్కిన్ సోనియా

ప్రత్యుత్పత్తి పత్రాలు

మార్చు

కొన్ని మొక్కలలో పత్రాలు పత్రోపరిస్థిత మొగ్గలను ఉత్పత్తి చేసి శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి.

  • రణపాల (బ్రయోఫిల్లమ్) లో పత్రపు అంచులలోని గుంటల్లో పత్రోపరిస్థిత మొగ్గలుంటాయి. కాచుగడ్డ (సిల్లా ఇండికా) లో పత్రాల కొనల వద్ద పత్రోపరిస్థిత మొగ్గలుంటాయి. వీటిలో పత్రాలు వంగి నేలను తాకినప్పుడు, వాటినుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి.
  • బెగోనియాలో పత్రోపరిస్థిత మొగ్గలు పత్రాల గాయాల భాగాల నుంచి ఏర్పడతాయి.

బోను పత్రాలు

మార్చు

నత్రజని సంబంధ పదార్ధాలు లోపించిన నేలల్లో పెరిగే కొన్ని మొక్కలు నత్రజని సంబంధ పదార్ధాల కోసం కీటకాలు వంటి సూక్ష్మ జంతువుల మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కీటకాలను ఆకర్షించి, భక్షించి, పోషణ జరుపుకోవడానికి వీలుగా వీటిలోని పత్రాలు బోను పత్రాలుగా మార్పుచెందుతాయి. ఇటువంటి మొక్కలను 'కీటకాహార మొక్కలు' అంటారు. బోనులుగా మారిన పత్రాలలో జీర్ణగ్రంధులు ఏర్పడి, జీర్ణరసాలను స్రవిస్తాయి. వీటి సహాయంతో కీటకాలు జీర్ణమై వాటిలోని నత్రజని సమ్మేళనాలు మొక్కచే శోషింపబడతాయి. ఉదా: నెపెంథిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా.

 
Chart illustrating leaf morphology terms. Click the image for the details.
 
Oddly pinnate, pinnatifid leaves (Apium graveolens, Celery).
 
Perfoliate bracts completely surrounding the plant stem (Lonicera sempervirens).
 
palmately compounded leafs
 
A single laciniate leaf of Adenanthos sericeus

చెట్లకు ఉండే ఆకులు వివిధ ఆకృతులలో ఉంటాయి. చెట్లకు ఉండే ఆకుల ఆకృతిని బట్టి వృక్షశాస్త్రంలో వివిధ పేర్లను నిర్ణయించడం జరిగింది. ఆకు యొక్క ఆకృతుల పేరు చెప్పగానే ఆకు యొక్క ఆకారం, ఆకు యొక్క అంచులు, ఆకు పైన ఉండే గీతలు అన్ని ఒకేసారి స్పురణకు వచ్చేలా ఆకు ఆకృతి పేరును వృక్షశాస్త్రంలో అభివృద్ధి పరుస్తున్నారు.

జలసంగ్రహణ పత్రాలు

మార్చు

రసభరితమైన ఈ పత్రాలు పోషక పదార్థాలను నిల్వ చేస్తాయి. ఉదా: కలబంద

పత్రం నిర్మాణం

మార్చు
 
పత్రం యొక్క అంతర్నిర్మాణం.

పత్రం నిర్మాణంలో మూడు భాగాలు ఉంటాయి.

  1. బాహ్యచర్మం (Epidermis) : బల్లపరుపుగా ఉన్న పత్రం యొక్క రెండు తలాలలోనూ బాహ్యచర్మం ఉంటుంది. వీనిలో పైతలంలోని దానిని ఊర్ధ్వ బాహ్యచర్మం (Upper epidermis) అని, అడుగుతలంలోని దానిని అథో బాహ్యచర్మం (Lower epidermis) అని అంటారు.
  2. పత్రాంతరం (Mesophyll) : రెండు బాహ్యచర్మాల మధ్య నిండియున్న సంధాయక కణజాలాన్ని పత్రాంతరం అంటారు. దీనిలో హరిత మృదు కణజాలం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆహార పదార్థాల సంశ్లేషణలో పాల్గొంటుంది. ఇందులో రెండు భాగాలుంటాయి. స్తంభ మృదుకణజాలం (Palisade mesophyll), స్పంజి వంటి మృదుకణజాలం (Sponge mesophyll).
  3. నాళికా పుంజాలు (Vascular bundles) : ఇవి పత్రాంతరంలో విస్తరించి ఈనెలుగా ఉంటాయి. ఇవి పత్రం అన్ని వైపులకు నీరు, ఖనిజ లవణాల ప్రసరణలోనూ, పత్రానికి యాంత్రిక ఆధారాన్ని కలుగజేస్తాయి. ప్రతి నాళికా పుంజంలో దారువు (Xylem), పోషక కణజాలం (Phloem) ఉంటాయి.

పత్రాలు-ఉపయోగాలు

మార్చు
  • వివిధ రకాలైన పత్రాలు మనకు ఆకు కూరలుగా ఉపయోగపడుతున్నాయి. తోటకూర, బచ్చలి, గోంగూర మొదలైనవి.
  • కొన్ని పత్రాల నుండి రంజనాలు తయారుచేసి, అద్దకం పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. తమలపాకు, గోరింటాకు మొదలైనవి.
  • కొన్ని పత్రాలను భోజనం చేయడానికి ఉపయోగిస్తాము. ముఖ్యంగా పర్వదినాలలో కొందరు కంచాలకు బదులు అరటాకులో భోజనం చేయడం హిందూ సంప్రదాయం. విస్తరాకులు, అరటాకు మొదలైనవి.
  • కొన్ని ఆకులను వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు.
  • తాటి, కొబ్బరి లాంటి పెద్ద ఆకులను నీడ కోసం, ఇండ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారు.

వివిధ ఆకారాలు గల ఆకులకు

మార్చు

హస్తాకారంలో ఆకులు

మార్చు

రంపం వలె అంచులు గల ఆకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

రెమ్మ

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  • Grundkurs Pflanzenbestimmung: Eine Praxisanleitung für Anfänger und Fortgeschritten von Rita Lüder, Quelle & Meyer, 2017, 552 Seiten.
  • Guia De Campo (Para Identificar Más De 1000 Especies Botanicas) por Susaeta Ediciones S A, Tikal-Susaeta, 2017, 498 páginas.
  • Iniciación a la botánica por Jose Luis Fuentes Yague, Ediciones Mundi-Prensa, 2001, 230 páginas.
  • Leaves: The formation, charactistics and uses of hundred of leaves in all parts of the world by Ghillean Tolmie Prance. 324 photographic plates in black and white, and colour by Kjell B Sandved 256 pages.

ఇవి కూడా చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పత్రము&oldid=4270774" నుండి వెలికితీశారు
  NODES