బాహుబలి

జైన్ డైటి

ఇదే పేరుతో ఉన్న చలనచిత్రం గురించి బాహుబలి:ద బిగినింగ్ చూడండి

బాహుబలి
Bahubali ಬಾಹುಬಲಿ బాహుబలి
57 అడుగుల ఎత్తుతో శ్రావణబెళగొళలోని గోమఠేశ్వర విగ్రహం కర్ణాటక భారతదేశం
జైన విగ్రహం
ఇతర పేర్లుగోమఠేశ్వరుడు
అనుబంధంజైన మతము
తోబుట్టువులుభరత చక్రవర్తి 98 మంది సోదరులు
తండ్రివృషభ నాధుడు
తల్లిసునంద

మూస:Jainism

జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైనమతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్‌ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాతి కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు

బాహుబలి జననం

మార్చు
 
కాయోత్సర్గ భంగిమలో ధ్యానం చేస్తున్న బాహుబలి విగ్రహం

విష్ణుపురాణం, జైన గ్రంథాలు, ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సునందాదేవి, యశస్వతీ దేవి (సుమంగళీదేవి అని కొందరు ఉదహరిస్తున్నారు) అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు. (విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది). భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు. బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో 'బ్రాహ్మీ' లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మి లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు.ఒకరోజు రాజనర్తకి అయిన 'నీరాంజన' నిండుకొలువులో ప్రభువు సన్నిధిలో నాట్యం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణిస్తుంది. ఈ మృతితో 'జీవితం క్షణభంగురం' అని అర్థమైన ఋషభనాథుడు విరక్తుడవుతాడు. తన రాజ్యంలోని అయోధ్యకు భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి, పోదనపురానికి రాజుగా బాహుబలిని ప్రకటించి- తాను సర్వసంగపరిత్యాగిగా మారి జనారణ్యంలోకి వెళ్లిపోతాడు. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే 'జినత్వం' పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.

చక్రరత్న ఆయుధం

మార్చు
 
ధర్మస్థలి లోని బాహుబలి విగ్రహం

రిషభుడు లేదా రిషభదేవుడు అడవులకు వెళ్ళిన తరువాత అతని కుమారుడు భరతుడు ఓ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం బలమైన సైన్యాన్ని నిర్మించడంతో పాటు కొత్త కొత్త ఆయుధాలను తయారుచెయ్యడం ప్రారంభించాడు. అతడి సైన్యం 'చక్రరత్న' అనే ఆయుధాన్ని తయారు చేసింది. దీన్ని భరతుడే ప్రయోగిస్తాడు. ఇది గురితప్పదు. అప్పటి ప్రపంచంలో భరతుని చేతుల్లో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గరాలేవు. అందుకే అతడు పాలిస్తున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ లొంగిపోయాయి. చివరికి తన 98 మంది సోదరుల రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నాడు. తమ్ముళ్ళందరూ తమ రాజ్య భాగాలను అన్నగారికి అప్పగించి తమ తండ్రి ఉంటున్న అడవులకు వెళ్ళి ఆయన శిష్యులుగా మారారు. ఇలా మహా సామ్రాజ్యం స్థాపించడం వల్లనే ఈ భరతుని పేరుమీదుగా భారతదేశానికి ఆ పేరు వచ్చింది అని జైనమతం ఆధారంగా చెపుతారు. శకుంతల, దుశ్యంతుల కుమారుడైన భరతుని పేరుమీదుగా ఈ పేరు రాలేదన్నది ఈ వాదనలోని ముఖ్యాంశం

అయితే భరతుని జైత్ర యాత్రను అడ్డుకుంటూ ముందుకు వచ్చిన వీరుడు మాత్రం బాహుబలి.

భరతుడు, బాహుబలి ల యుద్ధం

మార్చు
 
వేనూర్ లోని బాహుబలి విగ్రహం (1904 CE)
 
ధర్మస్థలిలోని బాహుబలి విగ్రహం (1973 CE)

భరతుడు బాహుబలి ఇద్దరూ బలశాలురే, ఇద్దరి బలగాలూ బలమైనవే కాబట్టి ఈ యుద్ధంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మంత్రులు ఒక ఒప్పందం చేసారు. యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తమ ఒక ప్రతిపాదన వారి ముందు ఉంచారు. ఇరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి, సైన్యాలను యుద్ధంలో దించకుండా అన్నదమ్ములిద్దరే యుద్ధం చెయ్యాలని, ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచినవారికి ఇచ్చివెయ్యాలనేది మంత్రుల ప్రతిపాదన సారాంశం. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ సమ్మతించారు. వీరిద్దరి మధ్య దృష్టి యుద్ధం, జలయుద్ధం, మల్ల యుద్ధం (ద్వంద్వ యుద్ధం) అనే మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు. అయితే ఎవ్వరూ ఆయుధం ప్రయోగించరాదనే షరతు విధించారు. ఆయుధాలు లేకుండా పోరాడి విజయం సాధించిన సమరం మానవచరిత్రలో ఇదే మొదటిది. అందుకే దీన్ని 'నిశస్త్రీకరణ' అన్నాడు. దీన్నే ఈరోజుల్లో మనం 'నిరాయుధీకరణ'గా అంటున్నాం.

ముందుగా దృష్టి యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధ నియమం ప్రకారం ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి. కళ్ళార్పకూడదు. ఎవరు ముందు కళ్ళు ఆర్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క. బాహుబలి తన అన్న భరతుని కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళ్ళలోకి క్రోధాగ్నుల్ని ఎలా విరజిమ్మడం... అనుకుంటూ ప్రసన్నవదనంతో అన్నగారి కళ్ళలోకి చూస్తున్నాడు బాహుబలి. భరతుని పరిస్థితీ అలాగే ఉంది. తమ్ముడి ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలకు తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంత చిత్తుడై కళ్ళు మూసుకున్నాడు. అంతే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తులు ప్రకటించారు. కళ్ళుమూసి తెరిచేలోపల ఓటమి పాలవ్వడంతో భరతుడు నివ్వెరపోయాడు. రెండవదైన జలయుద్ధం ప్రారంభమయింది. నదిలో దిగి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకోవడం ఈ యుద్ధం ప్రత్యేకత. యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలిసిపోయాడు. ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలినే విజయం వరించింది.

రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా గెలవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ యుద్ధమూ ప్రారంభమయింది. ముందుగా భరతుడు బాహుబలునిపై పిడిగుద్దులు కురిపించాడు. రెండో గుద్దుకే బాహుబలి కిందపడిపోయాడు. తమ్ముడు కిందపడిపోవడంతో కంగారు పడ్డాడు భరతుడు. తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు. ఇంతలో తెప్పరిల్లి పైకి లేచాడు బాహుబలి. ఇప్పుడు గుద్దే వంతు అతడిదే. అన్నను రెండు చేతుల్తో పైకి లేపి గిరగిరా తిప్పి జాగ్రత్తగా కిందకు దించాడు. గట్టిగా గుద్దటానికి చెయ్యి పైకి లేపాడు. ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడ చేరిన వారందరూ హాహాకారాలు చేశారు. భరతుడు కూడా ప్రాణ భయంతో ఒణికిపోయాడు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడరాదనే నియమాన్ని పక్కనబెట్టి తన చక్రరత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ అది పనిచెయ్యలేదని జైన గ్రంథాలు చెబుతున్నాయి. నియమ విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడనే కోపంతో బాహుబలి అన్నను గుద్దటానికి పిడికిలి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి. నేనేం చేస్తున్నాను. నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యజించిన రాజ్యాధికారం కోసమా తోబుట్టువును చంపబోతున్నాను...తుచ్ఛమైన ఈ రాజ్య భోగభాగ్యాలు వద్దు. తండ్రిగారు, తమ్ముళ్ళ లాగే నేనూ సన్యాసం స్వీకరించి శాశ్వితానందాన్ని విశ్వప్రేమను పొందుతాను... ఇలా సాగింది బాహుబలి ఆలోచన. అంతే తనను క్షమించమని అన్న భరతుని కోరాడు. తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు, దుస్తులను తొలగించుకుని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు. (జైన మతంలో దీక్ష తీసున్నవారు వెంట్రుకలను పీకడం ద్వారా తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు). భరతుడు ఎంత వారిస్తున్నా వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు.

ఫలించని తపస్సు

మార్చు

ఘోరమైన తపస్సు చేస్తున్నా బాహుబలికి జ్ఞానోదయం కాలేదు. అలా జ్ఞానోదయం కాకపోవడానికి కారణం అతడిలో ఇంకా మిగిలి ఉన్న గర్వమే. ఈ విషయాన్ని గ్రహించిన రిషభనాథుడు తన కుమార్తెలను బాహుబలి దగ్గరకు పంపించి గర్వాన్ని వదిలితేనే జ్ఞానోదయం అవుతుందని చెప్పమంటాడు. బ్రహ్మి, సుందరి అన్న బాహుబలి దగ్గరకు వెళ్ళి తండ్రి చెప్పిన విషయాన్ని చెబుతారు. దీంతో తప్పు తెలుసుకున్న బాహుబలి ఏక దీక్షతో తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందుతాడు.

తెలంగాణలో బాహుబలి

మార్చు

బాహుబలుడు రాజ్యం చేసింది తెలంగాణలోనే. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న బోధన్‌ను పూర్వం పౌదన్యపురం అనీ, పోదన పురం అనీ పిలిచేవారు. ఇదే బాహుబలుని రాజధాని. ఈ విషయాన్ని చెప్పే కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. పోదనపురం గురించి మహాభారతంలో కూడా ఉంది. అక్కడ జైన, బౌద్ధ, వైదిక మతాలు సమానంగా విలసిల్లాయి. అటువంటి పట్టణాన్ని బాహుబలుడు తన రాజధానిగా చేసుకున్నట్లు జైన గ్రంథాలు, విష్ణుపురాణం చెబుతున్నాయి. బోధన్‌లో అనేక జైన విగ్రహాలు, ఆలయాలు కనిపించడంతో బాహుబలుని రాజధానిగా నిజంగానే ఈ పట్టణం విలసిల్లిందేమో అని కొందరు చరిత్రకారులు అంటున్నారు.

భోదన్ లో ఒకప్పుడు అతిపెద్ద బాహుబలి విగ్రహం వుండేది

మార్చు

కర్నాటకలోని శ్రావణ బెళగోళలో విగ్రహానికి స్ఫూర్తినిచ్చిన విగ్రహం బోధన్‌లో ఉండేదని చరిత్రక ఆధారాలు చెపుతున్నాయి. బోధన్‌లో ఉన్న విగ్రహం బాహుబలునిది. ఇది శ్రావణ బెళగోళలో ఉన్న గోమఠేశ్వర విగ్రహం కంటే పొడవుగానూ, భారీగానూ ఉండేది. దీన్ని చూడటానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేవారు. అయితే కాలక్రమంలో ఆ విగ్రహం ఉన్న ప్రాంతం అంతా అడవిగా మారిపోయింది. ఒకసారి కర్నాటక ప్రాంతాన్ని ఏలుతున్న పశ్చిమగాంగ రాజు రాచమల్లుని మంత్రి చాముండరాయడు తమ ఆస్థానాన్ని సందర్శించిన ఓ కవి ద్వారా బోధన్‌లోని బాహుబలి విగ్రహం గురించి తెలుసుకున్నాడు. పౌదన్యపురంలో ఉన్న బాహుబలి విగ్రహం 500 ధనస్సుల పొడవు ఉందని ఆ కవి చెబుతాడు. అంతేకాదు అది మనుషులు చేరడానికి వీలు లేని కీకారణ్యంలో ఉందనీ చెబుతాడు. దీంతో చాముండరాయడు బోధన్‌ వెళ్ళి బాహుబలుని అద్భుతమైన విగ్రహాన్ని దర్శించుకుంటాడు. దాదాపు విగ్రహం అడవుల్లో అదృశ్యమయ్యే స్థితిలో ఉండటంతో ఇదే పరిమాణం, రూపం ఉన్న విగ్రహాన్ని శ్రావణ బెళగోళలో ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. తాను అనుకున్న విధంగా బాహుబలుని భారీ ఏకశిలా విగ్రహాన్ని శ్రావణ బెళగోళలో ఉన్న వింధ్యగిరిపై చెక్కించి ప్రతిష్ఠించాడు. ఆ సమయంలో వేయించిన శాసనం బోధన్‌ బాహుబలి విగ్రహం చుట్టూ భయంకరమైన కుక్కుట సర్పాలు తిరుగాడుతున్నాయని, అక్కడికి వెళ్ళడం కష్టంగా మారిందని, అందువల్ల చాముండరాయడు బోధన్‌లో ఉన్న విగ్రహానికి సమానమైన మరో విగ్రహాన్ని ఇంద్రగిరి కొండపై ప్రతిష్ఠించడానికి ప్రయత్నించాడని కానీ అంత ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయాడని చెబుతోంది. దీన్ని బట్టి బోధన్‌లో ఉన్న విగ్రహం ఎంతపెద్దదో అర్థంచేసుకోవచ్చు. చాముండరాయని గోమఠుడు అని కూడా అంటారు. అందుకే ఆయన ప్రతిష్ఠించిన బాహుబలుని విగ్రహానికి గోమఠేశ్వర విగ్రహం అని పేరువచ్చిందని అంటారు. మరికొందరు బాహుబలి విగ్రహాన్ని గోమఠేశ్వరునికి అంకితం ఇవ్వడం వల్లే ఆ పేరు వచ్చిందని అంటున్నారు. ఉత్తరభారతదేశంలో ఎక్కడా గోమఠేశ్వర విగ్రహాలు లేవు. అతడు పూర్తిగా దక్షిణ భారతానికే పరిమితమైన సిద్ధుడు. అది కూడా దిగంబర జైన శాఖకు చెందినవాడు. మొదట్లో కేవలం బోధన్‌ ప్రాంతానికే బాహుబలి (గోమఠేశ్వర) విగ్రహం పరిమితమై ఉందని చెప్పవచ్చు. ఆ తరువాత కర్నాటకలో శ్రావణ బెళ్గోళాతో పాటు మరి కొన్ని చోట్ల గోమఠేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠితమయింది. ఆంధ్రప్రాంతంలో విజయనగరరాజుల కాలంలో అమరాపురంలో గోమఠేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించేవరకు అక్కడ ఆయన విగ్రహమే కనిపించదు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయం నిజానికి గోమఠేశ్వరుని ఆలయం అని హిందువులు దాన్ని ఆక్రమించారని చరిత్ర కారులు అభిప్రాయ పడుతున్నారు. బోధన్‌లో ప్రారంభమైన అతి పెద్ద విగ్రహాల ప్రతిష్ఠాపన ఆ చుట్టుపక్కల ప్రాంతానికీ విస్తరించింది. బోధన్‌ గోమఠేశ్వరుని స్ఫూర్తితో అనేక జైన తీర్థంకరుల నిలువెత్తు విగ్రహాలను జైన శిల్పులు చెక్కారు. ప్రస్తుతం అవి హైదరాబాదులో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రధాన మ్యూజియంలో ఉన్నాయి.

జైన గ్రంథాలు, శ్రావణ బెళ్గోళాలో ఉన్న శాసనం బట్టి మన బోధన్‌లో ప్రపంచంలోని ఎత్తయిన బ్రహ్మాండమైన విగ్రహం ఒకటి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ విగ్రహం ఏమైపోయినట్లు? శాసనంలో పేర్కొన్నట్లు బాహుబలుని విగ్రహం అప్పట్లోనే అడవుల్లో కలిసిపోయిందా? కాల క్రమంలో విగ్రహం నేలపై ఒరిగి భూమిలో పూడుకుపోయి ఉండవచ్చు. మొత్తం దేశంలోనే భారీ విగ్రహాల ప్రతిష్ఠకు అంకురార్పణ చేసింది బోధన్‌ బాహుబలి విగ్రహం. అటువంటి విగ్రహం ఒకటుందనే విషయం చాలామందికి తెలియదు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి బాహుబలి తెచ్చిన పేరు సామాన్యమైనది కాదు. ఆయన్ని పూజించే కోట్లాది జైనుల ఆచార సంప్రదాయాలు మన తెలుగువారి జీవితంతో పెనవేసుకున్నాయి. ఆ విధంగా బాహుబలి మన సంస్కృతిలో ఒక భాగమయ్యాడు. అటువంటి బాహుబలి భారీ విగ్రహాన్ని విలువకట్టలేని సంపదగా గుర్తించి వెలికి తీసే పనిని చేపట్టాలని చరిత్రకారులు కోరుతున్నారు.

బోధన్ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారు?

మార్చు

బోధన్‌లో బాహుబలి విగ్రహాన్ని బాహుబలి అన్న భరతుడే నిలిపాడని జైనులంటున్నారు. ఉత్తర భారతం నుంచి తమ్ముడి రాజ్యంపై దండెత్తి వచ్చిన భరతుణ్ణి బోధన్‌లో ఎదుర్కొని గెలిచిన బాహుబలుడు రాజ్యపరిత్యాగం చేసిన తరువాత కాయోత్సర్గ భంగిమలో (నిలువు కాళ్ళపై నిలబడి) తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బాహుబలి కాళ్ళకు, చేతులకు తీగలు, పాములు చుట్టుకుంటాయి. అతడి చుట్టూ పుట్టలు పెరుగుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన అన్న భరతుడు అప్పటి రూపాన్ని ప్రతిబింబించే 525 ధనుస్సుల పొడుగున్న బాహుబలి శిలా విగ్రహాన్ని తయారు చేయించాడని జైన మతస్తుల్లో ప్రచారంలో ఉన్న కథ. భరతుడు ప్రతిష్ఠించిన ఈ విగ్రహాన్ని కుక్కుటేశ్వరుడని పిలిచేవారు.

శ్రావణ బెళగొళ లోని గోమఠేశ్వర విగ్రహం

మార్చు
 
ధర్మస్థలలోని గోమఠేశ్వర విగ్రహం

బాహుబలి లేదా గోమఠేశ్వర విగ్రహం కర్ణాటక లోని శ్రావణబెళగొళలో ఉంది. శ్రావణబెళగొళ కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని చెన్నగరాయపట్టణానికి సమీపంలోని పట్టణం. ఇది బెంగుళూరుకు 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెళగొళ అనే అతిచిన్న గ్రామానికి అద్భుతమైన ప్రఖ్యాతినీ, ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతనీ తీసుకొచ్చిపెట్టింది బాహుబలి విగ్రహమే! బాహుబలినే గోమఠేశ్వరుడు అనికూడా అంటారు. ఈ ఊరిలోని ఇంద్రగిరి పర్వతంపై 59 అడుగుల ఎత్తుగల ఈ ఏకశిలా విగ్రహం కాయోత్సర్గ భంగిమలో నగ్నంగా నించొనివుంటుంది. 470 అడుగుల ఎత్తున్న ఇంద్రగిరి శిఖరం మీద 59 అడుగుల ఎత్తున, ఉత్తరదిక్కుకు అభిముఖంగా నిలచివున్న ఈ ఏకశిలా విగ్రహం సమస్త ఐహిక బంధాలను తెంచుకున్న నిర్వికల్ప స్థితికి ప్రతీక.

ఈ విగ్రహాన్ని గ్రానైట్‌ రాతితో మలిచారు. ఏ ఆధారమూ లేకుండా నిటారుగా నిలబెట్టిన ఏకశిలా విగ్రహాలలో ప్రపంచంలో కల్లా ఇదే పెద్దది. గోమఠేశ్వరుని బాహువులే 30 అడుగుల పొడుగుంటాయంటే... ఈ విగ్రహం విరాట్‌ స్వరూపాన్ని ఊహించుకోవచ్చు.9 అడుగుల కైవారం కలిగిన పూర్ణవికసిత కమలపీఠం మీద ప్రతిష్ఠితుడైన బాహుబలి ఆజానుబాహుడు- అర్థనిమీలిత నేత్రుడై, ధ్యాన నిమగ్నుడైన 'గోమఠేశ్వరుడి' వదనారవిందంలోని దరహాసం భక్తుల్ని పరవశుల్ని చేస్తుంది, అలౌకికానందంలో ముంచివేస్తుంది. ఉంగరాలు తిరిగిన జుట్టు, విశాలమైన ఫాలభాగం, అర్థనిమీలిత నేత్రాలు, కోటేరు వేసినట్లున్న ముక్కు, దళసరి పెదవులు, మొనదేలిన చుబుకం, పొడవైన చెవులు, పటిష్ఠమైన కంఠం, విశాలమైన భుజాలు, ఆజానుబాహువులు, ఉన్నతమైన వక్షస్థలం, సన్నని నడుము, బలిష్టమైన ఊరువులు, కాళ్లు... 'ఇంతకంటే సుందర స్వరూపుడు సృష్టిలోనే మరొకరు ఉన్నారా?' అనిపిస్తుంది- ఈ మూర్తిని దర్శించినవారికి. ఐహిక బంధాలను త్యజించిన ఏకాగ్రతా దీక్షను ఆయన నగ్నత సూచిస్తుంది. కాళ్లకు, చేతులకు అల్లుకున్న మాధవీలతలు, చుట్టూ పెరుగుతున్న గుల్మవల్మీకాలు తపోదీక్షలో లీనమై... ఏ ఐహిక బాధలకూ చలించని ఏకాగ్రతకూ, దృఢసంకల్పానికీ సంకేతాలుగా శోభిస్తుంటాయి. ఈ విగ్రహాన్ని నిర్మించిన శిల్పాచార్యుల పేర్లు స్పష్టంగా తెలియవు కాని- 'అరిష్టనేమి' అన్న శిల్పాచార్యుని ఆధ్వర్యంలో ఈ విగ్రహం రూపుదిద్దుకొన్నదంటారు. ఇంద్రగిరి మీద తెల్లని నాపరాతితో నిర్మించబడిన 'బాహుబలి' శిల్పసౌందర్యం గంగరాజుల కాలపు శిల్పకళా వైభవానికీ, నైపుణ్యానికీ చిహ్నంగా ఈనాటికీ నిలిచివుంది. ఎండావానల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ గత పది శతాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఈ విగ్రహం నిలిచివుంది. చారిత్రక కథనం ప్రకారం 2వ మారసింహునికీ, 4వ రాచమల్లునికీ మంత్రిగా ఉన్న చాముండరాయడు ఈ బాహుబలి విగ్రహాన్ని తయారుచేయించాడు.

శ్రావణ బెళగోళలో గోమఠేశ విగ్రహం పాదాల దగ్గర ఉన్న శాసనాలు ఆ విగ్రహాన్ని, చుట్టు ఉన్న కట్టడాలను ఎవరు నిర్మించారో తెలియచేస్తున్నాయి. ఒక శాసనంలో కల్కియుగం అంటే 600 చైత్రమాసం సూర్యపక్షం ఐదవ రోజు ఆదివారం కుంభలగంలో చాముండరాయడు గోమఠేశుని విగ్రహాన్ని బెళ్గుళ నగరంలో ప్రతిష్ఠించినట్లు ఉంది. అయితే శాసనంలో పేర్కొన్న తేదీ, సంవత్సర నిర్ణయంలో చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. అందుకే కొందరు 981 సంవత్సరంలో ప్రతిష్ఠించారంటే మరికొందరు 983లో అంటున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ విగ్రహం క్రీస్తుశకం 980-984 మధ్య ప్రతిష్ఠించబడిందని చెప్పవచ్చు. మరో శాసనంలో విగ్రహం చుట్టు ఉన్న కట్టడాలను గంగరాజు నిర్మించినట్లు ఉంది.

రెండు కొండల మధ్య ప్రకృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే "బెళగొళ" కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు.అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్వాణం పొందడానికి ఈ కొండలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు.శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను శ్రమణ బెళగొళ అనేవారు.క్రమంగా శ్రావణ బెళగొళగా మారింది. స్థానికులు బెళగొళ అనే పిలుస్తారు.చంద్రగిరి, ఇంద్రగిరి కొండల మధ్య ఉన్న బెళగొళను చుడడానికి దేశంలో ఉన్న ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు.

ఇక్కడ ఉన్న 58 అడుగుల గోమఠేశ్వరుని విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. సా.శ.983వ సంవత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం.దీనికే గోమఠేశ్వరుని ఆలయంగా వాడుక.ఇక్కడ ఆలయం కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరగలేదు.కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు.బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుని విగ్రహాన్ని చెక్కడంలో శిల్పి అర్త్సమేణి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూడాల్సిందే.ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు.ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అలుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు.విగ్రహం కాలి గోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. ఒక సాధారణ మనిషి విగ్రహం దగ్గర నిలబడితే బాహుబలి పాదం ఎత్తుకు సరిపోతారు.

శ్రావణబెళగొళ ఊరిపేరు వెనకున్న కథ

మార్చు

'శ్రావణ బెళగొళ'కు ఆ పేరు రావటానికి వెనుక ఓ చక్కటి కథ ప్రచారంలో ఉంది. 'బెళ్‌' అనే కన్నడ పదానికి 'తెల్ల తామరలు' అని అర్థం. 'గొళ' అంటే కొలను. 'తెల్లని తామరపువ్వులతో నిండిన చక్కని కొలను' ఆ ఊళ్లో ఉంది కాబట్టి దానిని 'బెళగొళ' అన్నారు. ఈ ఊరు చుట్టుప్రక్కల 'హళె బెళగొళ', 'వీడి బెళగొళ' అనే ఊళ్లు ఉండటం వల్ల కూడా దీనికి 'బెళగొళ' అనే పేరు స్థిరపడిపోయింది. జైన భక్తులైన 'శ్రవణులు' ఈ ఊళ్లో ఎక్కువగా ఉండటంవల్ల 'శ్రవణ' అనే పదాన్ని ముందు చేర్చుకుని ఈ ఊరు 'శ్రావణ బెళగొళ' అయ్యింది అంటారు. తెల్లతామరలతో నిండిన చక్కని పుష్కరిణే కాక- 'ఇంద్రగిరి, చంద్రగిరి' అనే రెండు అందమైన కొండలు కూడా ఈ ఊళ్లో ఉన్నాయి. ఇంద్రగిరినే 'పెద్దమల' అనీ, చంద్రగిరిని 'చిన్నమల' అనికూడా అంటారు.

శ్రావణ బెళగొళకు వాయవ్య దిక్కున ఉన్న చంద్రగిరి కొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండమీదకు వెళ్లాలంటే 240 మెట్లెక్కి వెళ్లాలి. అశోక చక్రవర్తి తాతగారైన 'చంద్రగుప్త మౌర్యుడు' తన గురువు అయిన 'భద్రబాహు ముని'తోనూ, ఇతర శిష్యగణంతోనూ ఈ చంద్రగిరికి వచ్చి 'ప్రాయోపవేశ వ్రతదీక్ష' (కోరికల్నీ, ఆశయాల్నీ, బాధ్యతల్నీ త్యజించిన సర్వసంగపరిత్యాగులు 'నిరంతర ఉపవాసం'తో ప్రాణాల్ని త్యజించటం) పూని, సజీవ సమాధి చెందినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. భద్రబాహు ముని నిర్యాణం తర్వాత జైన శ్రవణులను విశేషంగా ఆకర్షించింది ఈ ప్రదేశమే. ఈ కొండపై 'ప్రాయోపవేశం' చేసి అనేకమంది శ్రవణులు సమాధి చెందినందువల్ల ఈ కొండను 'సమాధి మల' అనికూడా పిలుస్తూవుంటారు.

జైనాలయాలను 'బసదులు' అంటారు. చంద్రగిరిపై 'శాంతినాథ, పార్శ్వనాథ, చాముండరాయ, కౌంతీశ్వర బసదులు' ఉన్నాయి. అన్నిటిలోకీ ప్రాచీనమైనది 'చంద్రగుప్త బసది.' భరత విగ్రహం, మహానవమి మంటపం కూడా చూడదగ్గవే. 'ఏకాంకణ సహజగుహ' అయిన 'భద్రబాహు గుహ' కూడా ఇక్కడున్న ఒక ప్రత్యేక ఆకర్షణ. పెద్దమల లేక 'పెర్కళ్ళప్పు' అనికూడా పిలిచే ఇంద్రగిరి పర్వతం శ్రావణ బెళగొళకు జీవనాడి వంటిది అని చెప్పవచ్చు. 470 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండమీద 8 జైన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 'అమ్మదేవ, చిన్నణ్ణ, భరతబాహు, సిద్ధర బసదులు' ముఖ్యమైనవి. కొండపై 'గొమ్మఠేశ్వరాలయం' కూడా ఉంది. నాలుగు మంటపాలు, ఐదు మహాద్వారాలు, మూడు స్తంభాలతో అనేక ప్రాచీన శిల్పాలతో, శిలాశాసనాలతో విలసిల్లుతున్న ఇంద్రగిరి ఎంతో చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్థలం. సంస్కృతమే కాక, కన్నడ, తమిళ, మరాఠీ భాషలలో చెక్కిన అనేక శిలాశాసనాలు ఈ కొండపై ఉన్నాయి. 'గుళ్ళకాయి అజ్జి'గా పేరొందిన 'బిందెవ్వ' విగ్రహం, త్యాగస్తంభం యాత్రికులు, పర్యాటకులు తప్పకుండా చూడవలసినవి. ఇవన్నీ ఒక ఎత్తయితే- సౌందర్యం మూర్తీభవించిన 'బాహుబలి విగ్రహం' ఒక్కటీ ఒక ఎత్తు. ఇంద్రగిరి శిఖరాన నిర్మితమైన బాహుబలి కారణంగానే శ్రావణ బెళగొళ ప్రముఖ యాత్రాస్థలంగా రూపుదిద్దుకుంది.

చాముండరాయడి కథ

మార్చు

పెద్దమల లేక 'పెర్కళ్ళప్పు' అనికూడా పిలిచే ఇంద్రగిరి పర్వతం శ్రావణ బెళగొళకు జీవనాడి వంటిది అని చెప్పవచ్చు. 470 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండమీద 8 జైన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 'అమ్మదేవ, చిన్నణ్ణ, భరతబాహు, సిద్ధర బసదులు' ముఖ్యమైనవి. కొండపై 'గొమ్మఠేశ్వరాలయం' కూడా ఉంది. నాలుగు మంటపాలు, ఐదు మహాద్వారాలు, మూడు స్తంభాలతో అనేక ప్రాచీన శిల్పాలతో, శిలాశాసనాలతో విలసిల్లుతున్న ఇంద్రగిరి ఎంతో చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్థలం. 'ఇంద్రగిరి' శిఖరంపై ఉన్న బాహుబలి విగ్రహాన్ని నిర్మించింది... 'చాముండరాయడు' అనే మంత్రి! 2వ మారసింహుడికి, 4వ రాచమల్లుడుకీ మంత్రి అయిన చాముండరాయడు జైన మతస్తుడు. బాహుబలి స్వర్ణప్రతిమ గురించి విన్న చాముండరాయని తల్లి ఆ మూర్తిని దర్శించేదాకా ఏదీ ముట్టనని నిరాహారదీక్ష ప్రారంభిస్తుంది. ఆ బంగారు విగ్రహం అగోచరమైపోయిందని చెప్పినా ఆమె వినిపించుకోదు. ఇక చేసేదిలేక చాముండరాయడు తల్లితో సహా బాహుబలి విగ్రహాన్ని అన్వేషిస్తూ రాజ్యం నుంచి బయలుదేరతాడు. ఆ ప్రయత్నంలోనే 'శ్రావణ బెళగొళ'లోని 'చంద్రగిరి'కి చేరి ఓ రాత్రి అక్కడ నిదురిస్తాడు. ఆ రాత్రి కలలో చాముండరాయనికి 'కూష్మాండిని, పద్మావతి' అనే యక్షిణులు ప్రత్యక్షమై 'బాహుబలి స్వర్ణప్రతిమ దర్శనం అలభ్యం' అనిచెప్పి, భక్తిశ్రద్ధలతో వెతికితే ఎదురుగా ఉన్న ఇంద్రగిరిపై బాహుబలి ప్రత్యక్షమౌతాడు అని చెప్పి అదృశ్యమవుతారు. యక్షిణులు చెప్పినట్లుగా చాముండరాయడు 'ఇంద్రగిరి' చేరుకోగా... బాహుబలి శిరస్సు ప్రత్యక్షమౌతుంది. ఆ ముఖసౌందర్యానికి ముగ్ధుడైన చాముండరాయడు బాహుబలిని 'గుమ్మటేశ్వరుడు' అని కీర్తించాడంటారు. 'గుమ్మటుడు' అంటే 'మన్మథుడు' అనికూడా అర్థం. గుమ్మటేశ్వరుడే రానురాను 'గోమఠేశ్వరుడు'గా మారిందంటారు. తర్వాత చాముండరాయడు గుమ్మటేశ్వరుడిని శిరస్సు పరిమాణానికి తగినట్లుగా 59 అడుగుల ఎత్తుగల ఏకశిలా విగ్రహాన్ని నిర్మింపజేశాడు. విగ్రహప్రతిష్ఠ క్రీ||శ|| 982 ప్రాంతాలలో జరిగినట్లు భావిస్తున్నారు.

చాముండరాయనికి గర్వభంగం

మార్చు

విగ్రహ ప్రతిష్ఠాపన అయితే జరిగింది కాని, అంతటి భారీ విగ్రహానికి అభిషేకాలు, పూజ, వగైరా కార్యక్రమాలు నిర్వహించడం ఒక పెద్ద సమస్యగా మారింది. అప్పటికే అంత పెద్ద విగ్రహ నిర్మాణానికి కారకుడైనందుకు గాను చాముండరాయని మనస్సులో గర్వం చోటుచేసుకంది. ఆ గర్వంతోనే చాముండరాయడు 'బాహుబలి మహామస్తకాభిషేకానికి (తల నుంచి పాదాల వరకు అభిషేకం) పూనుకున్నాడు.

బిందెవ్వ

మార్చు

కానీ, ఎన్ని బిందెల పవిత్రజలాన్ని విగ్రహం తలపై గుమ్మరించినా... గోమఠేశ్వరుడు పూర్తిగా తడవటం లేదు. ఆ జలం ఆయన భుజాల వరకే సరిపోతోంది తప్ప కిందికి జారటం లేదు. ఈ పరిస్థితి చూసి చాముండరాయడు దిగులుతో ఉండగా... 'కూష్మాండిని' అనే యక్షిణి ఓ ముసలమ్మ వేషంలో చేతిలో చిన్నబిందెతో వచ్చి బాహుబలికి 'పంచామృత స్నానం' చేయిస్తానంటుంది. ఆమె కోరిక విని చాముండరాయడు నవ్వుకుంటాడు. నేను వేలకొద్దీ బిందెలతో అభిషేకిస్తున్నా తడవని దేవుడు- నీ దగ్గరున్న చిన్నబిందెలోని పంచామృతాలతో తడుస్తాడా?' అంటాడు. ఆ తర్వాత అయిష్టంగానే ఆమె బాహుబలికి అభిషేకం చేయటానికి ఒప్పుకుంటాడు. ముసలమ్మ బాహుబలికి నమస్కరించి, తన చేతిలో వున్న చిన్నబిందెలోని పంచామృతాలను దేవుని శిరస్సుపై పోస్తుంది. చిత్రంగా అంతటి దేవుడూ ఆ కొద్దిపాటి ధారతోనే పూర్తిగా తడిసిపోతాడు. ఈ విచిత్రానికి చాముండరాయడు మొదట్లో ఆశ్చర్యపోయినా... తర్వాత తన అహంకారానికి పశ్చాత్తాపపడి, తనను క్షమించమని భగవంతుడిని వేడుకుంటాడు. ఆత్మశోధన, పశ్చాత్తాపాల అనంతరం చాముండరాయడు చేసిన అభిషేక జలం బాహుబలి కాళ్లవరకూ జారి సంపూర్ణ అభిషేకం చేసినట్లే అవుతుంది. ఈ కథకు సాక్ష్యంగా చేతిలో చిన్నబిందెను పట్టుకొనివున్న ఓ ముసలావిడ విగ్రహాన్ని ఈనాటికీ బాహుబలి విగ్రహం దగ్గరగా చూడవచ్చు. స్థానికులు ఈమెను 'బిందెవ్వ' అని అంటూ ఉంటారు. సంపద, వైభవం, అధికారం లాంటివేేవీ నిర్మలమైన భక్తికి సాటిరావు అని బిందెవ్వ ఉదాహరణ ఋజువు చేస్తూవుంటుంది. ఏదిఏమైనా బిందెవ్వ కరుణ వల్ల బాహుబలికి తొలి 'మహామస్తకాభిషేకం' చేసినవాడుగా చాముండరాయడు ప్రసిద్ధి కెక్కాడు. అప్పటినుంచీ ఈ విరాట్‌ స్వరూపానికి 'మహామస్తకాబిషేకం' ప్రతి పుష్కరానికి (పన్నెండేళ్లకి) ఒకసారి ఎంతో వైభవోపేతంగా జరుగుతూనేవుంది.

గొమ్మట స్తుతి

మార్చు

గోమఠేశ్వరుడు కేవలం భౌతికంగా కనిపించే సౌందర్యమూర్తి కాదు. మూర్తీభవించిన ఆత్మసౌందర్యం అంటూ కీర్తించాడు 12వ శతాబ్దానికి చెందిన కన్నడ కవి 'జొర్పణ.' ఈయన కన్నడ భాషలో రాసిన 'గొమ్మట స్తుతి' బాహుబలి మహిమాన్విత విశేషాలను చక్కగా వివరిస్తుంది.

ఊరు సరస్సు పేర్ల వెనక మరో జానపద ఐతిహ్యం

మార్చు

వింధ్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండిరాయ ఎన్నో ప్రయాసలు పడి గోమఠేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ విగ్రహానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగేలా ఏర్పాటుచేశాడు. తొలినాళ్ళలో అభిషేకోత్సవం జరిపించాలని చాముండిరాయ నిర్ణయించాడు. గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తనకు తప్ప వేరే ఎవరికి ఆ అభిషేకోత్సవంలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు. బాహుబలి అభిషేకానికి అన్ని ద్రవ్యాలు తెప్పించాడు చాముండిరాయ. అభిషేకోత్సవం మొదలైంది. చాముండి తెప్పించిన అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అన్నీ ఐపోయాయి. కాని అభిషేక ద్రవ్యాలు బాహుబలి పాదాలకు కూడా చేరలేదు. చాముండిరాయకు యేమిచేయాలో పాలుపోలేదు. చివరికి ఒక అజ్జి (ముసలవ్వ) గుల్లెకాయ (కొబ్బరికాయ) లో కొన్ని పాలు తీసుకొని వచ్చిందట. తనకు అభిషేకానికి అనుమతి ఇవ్వమని కోరిందట. భటులు ముందు అంగీకరించకపోయినా, చాముండిరాయ ఆజ్ఞతో అనుమతించారట. అవ్వ ఆ చిన్న కొబ్బరి చిప్పలోని పాలను బాహుబలి మస్తకంపై పోయగా, ఆ కొద్ది పాలే ఆశ్చర్యంగా బాహుబలి శిరస్సు నుండి పాదాలకు చేరి మొత్తం తడిపివేశాయట. అంతటితో ఆగకుండా ఆ విగ్రహం నుండి పాలు కొండ మీదికి, ఆ వింధ్యగిరి మీద నుండి కిందికి ధారాపాతగా ప్రవహించాయట. అలా పారిన ఆ పాలతో ఏర్పడినదే ఈ సరస్సు అని, అందుకే ఇది తెల్లగా ఉన్నదని, దానికి శ్వేతకొలను లేదా దవళసరోవరమని పేరొచ్చిందని చెబుతారు. చాముండిరాయ అవ్వ మహాత్యానికి అబ్బురపడి, క్షమించమని కోరాడట. ఆ అవ్వ ఎవరో కాదని జైన జాతి రక్షక దేవత అని, భగవంతుడి సేవాభాగ్యాన్ని అందరికి కలిపించాలని చాటి చెప్పి, చాముండిరాయ కళ్ళు తెర్పించడానికి వచ్చిందని జైనులు విశ్వసిస్తారు. ఆ అవ్వకు ఒక ఆలయాన్ని నిర్మిచారు. ఆ ఆలయాన్ని గుల్లెకాయ అజ్జి ఆలయంగా పిలుస్తారు.

ఈ పట్టణంలో చంద్రగిరి, వింధ్యగిరి అను రెండు కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్య బద్రబాహు, అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు తపస్సు ఆచరించినట్లు తెలుస్తుంది[1]. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దిలో అశోకడు ఇక్కడ చంద్రగుప్తుని పేరుతో మఠాన్ని ఏర్పాటు చేశాడు. చంద్రగిరిపై గొప్ప ఆలయం ఉంది. దీనిని గంగ రాజు రాజమల్ల మంత్రి, నేమిచంద్రుని శిష్యుడిగా చెప్పబడె చాముండిరాయ నిర్మించాడు.

పట్టణంలోని వింధ్యగిరిపై 58 అడుగుల ఎత్తైన ఆకర్షణీయమైన గోమఠేశ్వరుడి ఏకశిలా విగ్రహం ఉంది[2]. దీనికి ప్రపంచంలో అతి పొడవైన ఏకశిలా విగ్రహంగా గుర్తింపు ఉంది. ఈ విగ్రహం యొక్క పీఠంపై కన్నడ, ప్రాచీన కొంకణి, సంస్కృత సమ్మిళితమైన లిపిలో ఒక శాసనం ఉంది. ఈ శాసనం సా.శ.981 నాటిదిగా చెప్పబడింది[3]. 2018లో మహామస్తకాభిషేకం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు గోమఠేశ్వరుడిగా పిలుస్తే, జైనులు బాహుబలిగా కొలుస్తారు. భారతదేశపు ఏడు అద్భుతాల జాబితా కొరకు టైంస్ ఆఫ్ ఇండియా (ఆంగ్ల దినపత్రిక)2007 ఆగస్టులో ఒక సర్వేను నిర్వహించింది. అందులో 49 శాతం మంది గోమఠేశ్వర విగ్రహానికి తమ మద్ధతు తెలిపి మొదటి స్థానాన్ని కట్టబెట్టారు[4]. ఈ గోమఠేశ్వరుడికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపూలు, బంగారు నాణేలతో అభిషేకం చేస్తారట. ఈ ఉత్సవానికి దేశ నలుమూలల నుండి వేలకొలది జైనులు తరిలివస్తారట. మళ్ళీ 2018లో మహామస్తకాభిషేకం జరుగుతుంది.

చిత్రమాలిక

మార్చు

మహా మస్తకాభిషేకం

మార్చు
 
శ్రావణ బెళగొళలోని బాహుబలి (లేక గోమఠేశ్వరుడు) విగ్రహం పాదానికి అభిషేకం చేస్తున్న జైన మహిళ

చాలా విగ్రహాల మాదిరిగానే బాహుబలికి కూడా నిత్యాభిషేకం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ స్వామి విరాట్‌ స్వరూపం కారణంగా ఆ అభిషేకం పాదాలకు మాత్రమే పరిమితమై 'పాదాభిషేకం'గా పేరుపొందింది. విగ్రహాన్నంతటినీ అభిషేకించే కార్యక్రమాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. దీనినే 'మహామస్తకాభిషేకమ్‌' అంటారు.

ఆసక్తిగా అనిపిస్తే... 12 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా జరిగే ఈ 'బాహుబలి మహామస్తకాభిషేకమ్‌' గురించీ, ఆ కార్యక్రమ ప్రాధాన్యత గురించీ మరికొన్ని విషయాలున్నాయి. బాహుబలి మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషేకం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే అభిషేకించగలరు. గోమఠేశ్వరునికి కేన్ల కొద్దీ పాలు, తేనె, పెరుగు, అన్నం, కొబ్బరి పాలు, నెయ్యి, చక్కెర, బాదం పప్పు, కుంకుమ పువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూట్స్, పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు.పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్ కడతారు.దీని మీదకు వెళ్ళి అభిషేకం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభిషేకం సమయంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆలయం కొండమీద ఉంటుంది.ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయినా ఎక్కడం కష్టమే.మెట్లు ఎత్తుగా ఉండడంతో యువకులు కూడా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎక్కుతారు. మొత్తం మీద పదిహేను-ఇరవై నిమిషాల కంటే పట్టదు.బాహుబలి విగ్రహం తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే.జైన తీర్థంకరుల దేవాలయాలు ఉన్నాయి.వీటిలో చంద్రగిరి పర్వతం మీద అశోకుడు నిర్మించినట్లు నిర్మించినట్లు చెబుతున్న చంద్రగుప్త బస్తీ ముఖ్యమైనది.ఇందులో సెమీ ప్రిషియస్ స్టోన్స్ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి.ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన్ దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు.

సాధుసన్యాసుల రాకతో శ్రావణ బెళగొళ 'భూమి మీద వెలసిన బ్రహ్మలోకం' లాగా శోభిల్లుతూ ఉంటుంది. మహా మస్తకాభిషేకాన్ని 'గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ శ్రావణ బెళగొళ'గా వ్యవహరిస్తూ ఉంటారు. శోడషోపచారాలలో అభిషేకానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. బాహుబలికి జరిగే మహామస్తకాభిషేకం 1,008 కలశాల జలంతో జరుగుతుంది. కొబ్బరినీళ్లు, అరటిపళ్లు, బెల్లం, నెయ్యి, ఎండు ఖర్జూరాలు, బాదంపప్పు, గసగసాలు, పాలు, పసుపు, బంగారునాణాలు, జలం నిండిన కలశాలను బాహుబలి తలపై గుమ్మరించనప్పుడు- అవి విగ్రహం మీదుగా రంగులీనుతూ పాదాల దగ్గరికి జాలువారుతాయి. పాదాల దగ్గరకు చేరిన పదార్థాలను భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ ప్రసాదం లభిస్తే భక్తులు తమ జన్మ చరితార్థమైనట్లేనని భావిస్తారు. మంగళవాద్యాల హోరులో, జైనసాధువుల మంత్రోచ్ఛారణ నేపథ్యంలో, భక్తుల జయజయ నినాదాల ధ్వనితో 'మహా మస్తకాభిషేక కార్యక్రమం' ప్రారంభమవుతుంది. మొదటగా బాహుబలి విగ్రహం వెనుక నిర్మించిన వేదిక మీద నుంచి పవిత్ర ముహూర్త సమయంలో జైనగురువులు బాహుబలికి శుద్ధోదకంతోనూ, క్షీరంతోనూ, ఖృతంతోనూ అభ్యంగన స్నానం చేయిస్తారు. పంచామృత స్నానం తరువాత మహామస్తకాభిషేకం ప్రారంభమై 1008 పవిత్ర కలశాలతో అభిషేక కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ప్రతి కలశాన్నీ మామిడి ఆకులతోనూ, నారికేళ ఫలంతోనూ అలంకరిస్తారు. అభిషేకానికి సువర్ణ, రజిత, ఇత్తడి వగైరా కలశాలను ఉపయోగిస్తారు. చతుష్కోణ కుంభాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఆకాశంలో నుంచి హెలికాప్టర్‌ ద్వారా పుష్పాలను చల్లే 'పుష్పవృష్ఠి'- ఈ కార్యక్రమంలో ముఖ్యాకర్షణగా కొద్ది సంవత్సరాల నుంచీ భాసిస్తోంది. కార్యక్రమం ఇక కొద్దిసేపటికి ప్రారంభమౌతుంది అనగానే జైనసాధువులు వేదిక పైకి చేరి, కలశాలతో సిద్ధంగా ఉంటారు. ప్రతీ జైనగురువు చేతిలోనూ ఒక కలశం, పాలతో నిండిన ఒక పాలపాత్ర, ఒక నేతిపాత్ర సిద్ధంగా ఉంటాయి. సరిగ్గా ముహూర్తం వేళకు అభిషేకం ప్రారంభమవుతుంది. మొదటగా పాలతోనూ, తరువాత నేతితోనూ మూర్తిని అభిషేకిస్తారు. ఆ తరువాత శతాధిక కలశాలతో యధావిధిగా 'మహామస్తకాభిషేక మహోత్సవం' కొనసాగుతుంది. మొట్టమొదటి 'మహామస్తకాభిషేకాన్ని' బాహుబలి విగ్రహ నిర్మాత అయిన చాముండరాయడు జరిపినట్లు చెబుతారు. తరువాత 1398వ సంవత్సరం నుంచీ 'పండితాచార్య' అనే ఆచార్యుడు 12ఏళ్లకి ఒకసారి వరుసగా ఏడుసార్లు మహామస్తకాభిషేకాన్ని నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 1659 వ సంవత్సరం నుంచీ మైసూరు మహారాజులు బాహుబలికి మహామస్తకాభిషేకాన్ని నిర్వహించడం ప్రారంభించారు. 1910వ సంవత్సరంలో అప్పటి మైసూరు ప్రభువైన 'కృష్ణరాజేంద్ర వొడయార్‌' మహామస్తకాభిషేకాన్ని నిర్వహించారు. ఆ సమయంలో శ్రావణ బెళగొళలో మొదటిసారిగా 'అఖిల భారత దిగంబర జైన మహాసభ' జరిగింది. ఈ మహాసభకు దేశం నలుమూలల నుంచీ దిగంబర జైనులు అసంఖ్యాకంగా హాజరై జైనమత వ్యాప్తికి విస్తృతమైన కృషి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభంలో మహామస్తకాభిషేకానికి మృణ్మయపాత్రలను కూడా ఉపయోగించటం మొదలుపెట్టారు. 1925వ సంవత్సరంలో జరిగిన మహామస్తకాభిషేకంలో తొలిసారిగా స్వర్ణకలశాలను ఉపయోగించటం జరిగింది. ఆ సంవత్సరం 51 సువర్ణ కలశాలు, 300 రజత కలశాలు, 300 అల్యూమినియం కలశాలు, 357 ఇత్తడి కలశాలు... మొత్తం 1008 కలశాలతో బాహుబలికి మహామస్తకాభిషేకాన్ని నిర్వహించారు. 1953వ సంవత్సరంలో మొదటగా 'చతుష్కోణ కుంభాలు' అని పేరుగల కలశాలను నాలుగింటిని ఉపయోగించటం జరిగింది. ఆ సంవత్సరమే 'పుష్పవృష్టి' పేరుతో హెలికాప్టర్‌లోనుంచి బాహుబలి దివ్యమంగళమూర్తిపై పుష్పాలను కురిపించారు. ఈ విధంగా ప్రతిసారీ మహామస్తకాభిషేకానికి కొత్త అంశాలు, అందాలు చేరుస్తూ అపూర్వమైన శోభను కలిగిస్తున్నారు. బాహుబలి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 1000 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 1981వ సంవత్సరంలో జరిగిన మహామస్తకాభిషేకాన్ని 'బాహుబలి ప్రతిష్ఠాపన సహస్రాబ్ది మహోత్సవ మహామస్తకాభిషేకం'గా అభివర్ణించారు. అప్పటికి మహామస్తకాభిషేకాలు ప్రారంభించి 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి కాబట్టి ఆ ఉత్సవాలకు అలా పేరుపెట్టడం జరిగింది. ఆనాటి ఉత్సవాలలో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కూడా పాల్గొన్నారు. 19.12.1993 వ తారీఖున శ్రావణ బెళగొళలో జరిగిన 'బాహుబలి మహామస్తకాభిషేకానికి' అప్పటి ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు హాజరయ్యారు. 2005 సంవత్సరం తరువాత తిరిగి 2017వ సంవత్సరంలో 'బాహుబలి మహామస్తకాభిషేకం' జరుగనుంది.

చారిత్రక శాసనాలు

మార్చు

చరిత్ర పరిశోధకులు 523 శాసనాలను గుర్తించారు.ఇందులో చిన్న కొండ మీద 271, పెద్ద కొండ మీద 172,80 శాసనాలు బెళగొళలో, మరో 50 బెళగొళ పరిసర గ్రామాల్లో ఉన్నాయి.ఇవన్ని కూడా సా.శ.600-19వ శతాబ్దం మధ్యనాటివే.లెక్కకు మించిన శాసనాలే కాక లెక్కలేనన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.జైనతీర్థాంకురుల స్మృతి చిహ్నాలుగా పర్యాకులను ఆకర్షిస్తాయి. గోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది.బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు. (రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు ఋషబుడని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు.రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు.పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజధాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు.భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది.తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు.బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు.అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు.స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్ధంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్ధం చేసి గెలుస్తాడు.భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి, అంతలోనే పునరాలోచనలో పడతాడు.[1]

జినత్వం

మార్చు
 
బాహుబలి ఏకశిలా విగ్రహం కాకర్ల (1432 CE)

బాహుబలి ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.మన దేశంలో బౌద్ధజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్ధం వ్యాపి చెందినంతగా జైనం విస్తృతం కాలేదు.జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు.కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు.శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు.వీరు సంసార జీవితం కొనసాగిస్తారు.దిగంబరులు సన్యాసులు.వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని కృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Rice B Lewis (1889). Inscriptions At Sravana Belgola. Retrieved 2020-07-13.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బాహుబలి&oldid=4308608" నుండి వెలికితీశారు
  NODES
languages 1
mac 2