ముత్యాలు (ఆంగ్లం: Pearl) ప్రకృతిలో లభించే నవరత్నాలలో ఒకటి. ఇవి మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలలో తయారవుతాయి. మొదటగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేక మైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది.ముత్యాలలో మంచి నీళ్ళలో ఏర్పడ్డవి, ఉప్పు నీళ్ళలో తయారైనవి రెండు రకాలున్నాయి. ఇవి చూడడానికి ఒకే రకంగా అనిపించినా వేర్వేరు స్థానాల నుంచి తయారవుతాయి.1900 దశకంలో కృత్రిమ పద్ధతిలో ముత్యాలు తయారు చేయడం కనిపెట్టే దాకా ఇవి చాలా అరుదుగా లభ్యమయ్యేవి కాబట్టి సమాజంలో ధనికులు, ఉన్నత వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేవి.[1]. ఎక్కడి నుంచి వచ్చినా ఎలా ఏర్పడినా ఇవి తయారయ్యేది మాత్రం కాల్షియం కార్బొనేట్ అనే పదార్థం తొనే. ఇవి కొన్ని గుండ్రంగానూ, కొన్ని ద్రవ బిందువుల ఆకారంలోనూ, కొన్ని అండాకారంలోనూ, కొన్ని అర్థ వృత్తాకారంలోనూ ఉంటాయి. వీటిలో గుండ్రంగా ఉన్నవి, బిందువు ఆకారంలో ఉన్నవి ఎక్కువ ధర పలుకుతాయి.[2] హైదరాబాదీ ముత్యాలు భారతదేశంలోని ముత్యాల వ్యాపారంలో ప్రధాన కేంద్రంగా నిలుస్తున్నాయి.

ముత్యాల హారాలు.

కొన్ని విశేషాలు

మార్చు
 
రంగురంగుల ముత్యాలు.

ముత్యాల సాగు చైనా, జపాన్, మయన్మార్, భారతదేశం వంటి దేశాలలో పెద్ద వ్యాపారం. ఇవి చూసేందుకు మృదువుగా కనిపించినా దాని నిర్మాణం పొరలు పొరలుగా ఉండటం చేత నలిపివేయడం లేదా పగులకొట్టడం కష్టమైన పని.[3]

పురాణాలలో ముత్యం గురించి ప్రస్థావన

మార్చు

ప్రాచీన ఈజిప్టులో దీనికి ప్రముఖ స్థానం కల్పించినట్లుగా వారి చరిత్ర చెబుతోంది.అతి ప్రాచీనమైన ముత్యంగా ప్రసిద్ధి గాంచిన జోమాన్ జపాన్ దేశానికి చెందింది. దీనికి 5500 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనీయులు కూడా వారి ఆభరణాలలో ముత్యాలు వాడినట్లుగా 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన వారి గ్రంథాలు తెలుపుతున్నాయి. ప్రాచీన చైనీయుల సంకేత భాషలో ముత్యము స్వచ్ఛతకు, విలువకు సంకేతంగా భావించేవారు. అప్పటి ప్రభుత్వాలు ముత్యాలను పన్ను రూపంలో చెల్లించడానికి కూడా అనుమతించేవి. ధనవంతులైన వారు చనిపోయినపుడు వారి నోట్లో ఒక ముత్యాన్ని ఉంచి ఖననం చేసేవారు.

సహజ సిద్ధమైన ముత్యాలు

మార్చు

పేరుకు తగ్గట్లుగానే ఇవి ఎవరిచేతనైనా పెంచబడకుండా వాటంతట అవే తయారవుతాయి. ఇప్పటికీ చాలాచోట్ల ముత్యాలు సహజంగానే ఏర్పడుతుంటాయి. కానీ వీటిని కనుగొనాలంటే ఎక్కడో సముద్రపు అడుగుభాగాన వెతకాల్సిందే. ఇప్పట్లో సహజ ముత్యాలను సంపాదించి ఒక హారాన్ని తయారు చెయ్యాలంటే దాదాపు అసాధ్యమైన పని.

కృత్రిమ ముత్యాలు

మార్చు

కృత్రిమ ముత్యాలను (మాయా ముత్యాలు) ను ప్రపంచమతటా వెదజల్లినవాడు మికీమోటో. ఈతడు జపానుదేశస్థుడు. చాలా బీదకుటుంబమునకు చెందినవాడు.వీధుల్లో తిరిగి చేపలు అమ్ముకొనేవాడు. తన 33వయేట ఒక సముద్రవస్తుప్రదర్సనలో చాలా ఖరీదయిన ముత్యాలను, వాతి తయారి విధానాన్ని చూసాడు.సముద్రంలో ఉండే ముత్యపుపురుగు (Oyster) దేహములోనికి ఒక ఇసుకకణం గాని, లేక ఒక ముత్యపుచిప్ప కణంగాని ప్రమాదవశాత్తు ప్రవేశించి దానికి బాధ కలిగిస్తుంది. ఈ బాధా నివారణకోసం ముత్యపుపురుగు కాల్షియం కార్బొనేటు (Calcium carbonate) nu అనేకవేల పల్చని పొరలుగా, ఈ సూక్ష్మకణం చుట్టూ స్రవింపజేస్తుంది. ఈపొరలు క్రమంగా ఘనీవభవించి ముత్యము అవుతుంది. సృష్టివైచిత్ర్యం! ఒక చిన్న ముత్యపు పురుగు తన అవేదనను అత్యంతలావణ్యమైన ఒక ముత్యంగా మారుస్తుంది. ఇది తెలుసుకున్నా అతడు వెంటనే ఆగో అఖాతానికి వెళ్ళి పరిశోధనలు చేసాడు. ఇక్కడ సముద్రం ఎక్కువలోతు లేక ప్రశాంతగాను, సొరచేప మొదలైనవి లేకుండానూ ఉంటుంది. సుమారు పదివేల ముత్యపు పురుగులను పట్టుకొని పురుగుకూ, పురుగు చిప్పకు మధ్య ఒక్కొక్క ఇసుకరేణువును వుంచి వాటిని మళ్ళీ నీళ్ళలోకి వదిలిపెట్టాడు. కొన్ని నెలలతరువాత పరీక్షించి చుస్తే ముత్యాలు తయారయిన సూచన అతడికి ఏమాత్రమూ కనిపించలేదు.

మికీమోటో ఏమాత్రమూ నిరాశ చెందక తన పరిశోధనలు మళ్ళా ప్రారంభించాడు. ఇసుకరేణువులకు బదులు చిన్న గాజు కణాలూ, ముత్యపుకణాలూ మొదలైనవి పురుగుశరీరంలోని అన్ని భాగాలలోనూ ఉంచి, వివిధ ప్రమాణాల నీటిలోనూ, వివిధ శీతోష్ణపరిస్థితులలోనూ తన పరీక్షలు సాగించాడు. రెండుమూడు సంవత్సరాలు ఈవిధంగా ఫలశున్యంగా గడిచింది. ఈప్రయత్నాల కారణంగా అతడు అప్పులపాలయ్యాడు కాని అతడు ఏమాత్రమూ నిరుత్సాహ పడలేదు. దీనికి తగ్గట్టు దురదృష్టవశాత్తు 3వ సం.లో ఒక గుంపులోని పురుగులు తప్ప మిగిలినవన్నీ నశించాయి. నిరాశ చెంది ఈమిగిలిన పురుగుల్ని మికీమోటో, అతని భార్యా పరీక్షించారు. కాని ముత్యాలజాడ ఏమాత్రమూ కనిపించలేదు. 6రోజుల తరువాత 1893 జూలై 11 న అతడి కష్టాలకు ఫలితం కనిపించిది. ఒక పుర్గును చంపి చూడగానే దానిలో అర్ధగోళాకారమైన ఒక ముత్యం కనిపించిది. మిగిలిన పురుగులలో కూడా అలానే కనిపించాయి. వెంటనే మికీమోటో ముత్యల తయారీకి స్వంతహక్కు (Patent) తీసికొనాడు. 'టటోకూ అనే ద్వీపంలో పెద్దలెక్కన లాలుగు సంవత్సరాలు పరీక్షలు కొంసాగించాడు. మొదటి సం.లో ఫలితాలు అంత తృప్తికరంగా రాకపోయినా తరువాతి సం.లలో పంట బానే ఉంది. 1900 సం.లో ఏడవ ఎడ్వర్డు చక్రవర్తి పట్టాభిషేక సమయములో జపాను ప్రతినిధి ఆయనకు కొన్ని మికీమోటో ముత్యాలను బహూకరించి అందరికీ ఆశ్చర్యం కలుగ జేసాడు. మికీమోటో కీర్తి నలుదిశలా ప్రాకింది. జపాను చక్రవర్తి ముత్యాలను పండించే ఈక్రొత్త విధానాన్ని అతడి ద్వారనే విన కుతూహలపడి అతనిని తనవద్దకు రావించి గౌరవించాడు.

మికీమోటో గోళాకారంగల ముత్యాలను పండించడంలో ఇంకా పూర్తిగా ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఇల్లా ఉండగా 1905 వ సం.లో అదృష్టవశాత్తు అయిదు ఉత్కృష్టమయిన గుండ్రని ముత్యాలు లభించాయి. ప్రమాదవశంవల్ల ముత్యపుపురుగు మాంసంలో ఇసుకకణాలు ప్రవేశించడంవల్ల దానిచుట్టు కాల్షియం కార్బోనేటు ఘనీభవించి ఈముత్యాలు తయారయ్యాయి అని అతడు తెలుసుకొన్నాడు. ఇంతవరకూ ఈ కణాలు పురుగు చిప్పకు మాంసానికి ఉంచడంవల ఈ ద్రవం అన్ని వైపులా సమానంగా పేరుకొనడానికి అవకాశం లేక ముత్యాలు అసంపూర్ణంగా అవుతూవచ్చాయి. దీనితో మికీమోటోకు ముత్యాల రహస్యం పూర్తిగా తెలిసిపోయింది. వెంటనే ఇసుకకణాలు, ముత్యపుకణాలు పురుగుమాంసంలోనే ఉంచి తన పరీక్షలు కొనసాగించాడు. ఈపనికి చాలా నైపుణ్యం కావాలి. కణం చాలా లోతుగా పోతే పురుగు చచ్చిపోతుంది. లేకపోతే కణం బయటకి ఊడిపోయే అవకాశం ఉంది. ఈపనికి ప్రత్యేకనిపుణులు అవసరం. పరీక్షలో మొదటి నూరుపురుగులలో ఆరు అత్యంత సౌందర్యమైన ముత్యాలు దొరికాయి.

మికీమోటో పెద్దలెక్కను పండించడంలో కృతకృత్యుడు కాగానే, మికీమోటో, ముత్యపుపురుగులను క్రూరజంతువుల బారినుండి పడకుండా అనెక మార్గాలను అంవేషించాడు. సముద్రంలో బ్రహ్మాండమయిన తీగపంజెరాలను నిర్మించి వాటిలోనె పురుగులు జాగ్రత్తగా పెరగడానికి, ముత్యాల పంటకి ఏర్పాత్లు చేసాడు. అసలు ముత్యాల ధరలో నాల్గవ వంతుధరకే తన ముత్యాలను యూరోపులో మికీమోటో అమ్మడం ప్రారంభిచగానే పెద్ద సంచలనం బయలుదేరింది. అసలు ముత్యాలకూ, ఈతక్కువ ఖరీధు కల ముత్యాలకూ గల తేడా తెలిసికోవడం చాలా కష్టమయినపని అయింది కొనేవారికి.ఈ తేడా తెలిసికోవడం ఒక్క X కిరణాల సహాయంతోనే వీలుపడుతుంది. అసలు ముత్యాల వ్యాపారులకు చాలా నష్టాలు రాసాగాయి. వెంటనే వారంతా ఈక్రొత్తముత్యాలను, వాటిని విక్రయించే వారిని వెలివేశారు. దానితో ఈ తగవు న్యాయస్థానము వరకు వెళ్ళింది. అసలు ముత్యాల వర్తకులు ఈ క్రొత్తరకపు ముత్యాలు నాణ్యమైనవి కావు రుజువు చేయడానికి ప్రయత్నించారు. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చాలా గట్టి పరీక్షలు చేసి ఈముత్యాలు ఆని విధాలా నాణ్యమైనవనే నని నిర్ణయించారు. అసలు ముత్యానికీ, ఈమికీమోటో ముత్యానికీ గల తేడా ఒక్కటే. అసలు ముత్యంలో కేంద్రకణము (Central particle) స్వాభావికంగా ముత్యపుపురుగు దేహంలో ప్రవేశిస్తుంది. మికీమోటో ముత్యంలో కేంద్రకణం కృత్రిమంగా ఉంచబడుతుంది. చివరికి మికీమోటో యే గెలిచాడు.

తరువాత అతడు ప్రపంచలోని అన్ని నగరాలలోను తన ముత్యాలను విక్రయించే కేంద్రాలను నెలకొల్పాడు. ఒకానొక కాలంలో నూటికి 85వంతులు మికీమోటో ముత్యాలే ఉండేవట. 1921వ సం.లో అతడు తీసికొన్న స్వంతహక్కు గడువు తీరిపోయింది. వెంటనే అనేకమంది పోటీదారులు ముత్యాలను పండించడము ప్రారంభిచారు. వీరిలో చాలా మంది అతడి వద్ద తర్ఫీదు పొదినవారే. కాని వారంతా చవకరకపు ముత్యాలను విక్రయించడం ప్రారంభిచారు. దీనితో మికీమోటో వీరందరికీ పాఠం చెప్పడానికి, తాను ఉత్తమ రకపు ముత్యాలనే విక్రయిస్తానని లోకానికి తెలియచెప్పడానికి, 1933 సం.జూలై 1వతేదీన 750,000 రెండవరకపు ముత్యాలను ఒక గుట్టగా పోసి దగ్ధంచేసాడు.

మూలాలు

మార్చు
  1. http://www.pbs.org/wgbh/nova/pearl/time.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-11. Retrieved 2008-08-21.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-08-27. Retrieved 2008-08-21.
"https://te.wikipedia.org/w/index.php?title=ముత్యము&oldid=3468559" నుండి వెలికితీశారు
  NODES